లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్‌ రాయిస్‌ ఎనిమిదో తరం ఫాంటమ్‌ కారును మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారు ధర 9.50 కోట్ల రూపాయలు. దీనికి 6.75 లీటర్‌ ట్విన్‌ టర్బోచార్జ్‌డ్‌ వి12 ఇంజన్‌ అమర్చారు. ఈ ఇంజన్‌ 563 హార్స్‌పవర్‌ శక్తిని, 900 ఎన్‌ఎం టార్క్‌ను అందిస్తుంది. 5.4 సెకండ్లలోనే జీరో నుంచి వంద కిలోమీటర్ల వేగం అందుకుంటుంది. ఈ కొత్త సీరీస్‌ కారు ఇప్పటివరకు మార్కెట్లో ఉన్న ఫాంటమ్‌లతో పోల్చితే 30 శాతం తక్కువ బరువు కలిగి ఉంది. రాత్రివేళల్లో కారు హెడ్‌లైట్లు 600 మీటర్ల వరకు కాంతిని విస్తరించడం వల్ల భద్రతాపరంగా మరింత సమర్ధవంతంగా ఉంటుంది. స్టాండర్డ్‌ వీల్‌బేస్‌ ఉన్న కారు ధరను 9.50 కోట్ల రూపాయలుగాను, పెద్ద వీల్‌బేస్‌ ఉన్న కారు ధర 11.35 కోట్ల రూపాయలుగాను ప్రకటించింది. నాలుగు సంవత్సరాల సర్వీసు ప్యాకేజీ, రీజినల్‌ వారెంటీ కూడా ఈ ధరలో ఇమిడి ఉన్నాయి.
ఈ ఏడాది మరో ఐదు మోడల్స్‌
భారత్‌లో తమ ఉత్పత్తుల శ్రేణిని విస్తరించే ప్రణాళికల్లో భాగంగా ఈ కారును విడుదల చేసినట్టు రోల్స్‌ రాయిస్‌ ఆసియా పసిఫిక్‌ రీజినల్‌ డైరెక్టర్‌ పాల్‌ హారిస్‌ ప్రకటించారు. మరో లగ్జరీ కారు కలినన్‌ ఈ ఏడాది ద్వితీయార్ధంలో మార్కెట్‌లోకి తీసుకువస్తామని, బ్లాక్‌బాడ్జ్‌తో పాటు ఏడాదిలో మరో ఐదు మోడళ్లు మార్కెట్లోకి వస్తాయని ఆయన చెప్పారు. వాటిలో ఫాంట్‌, ఘోష్ట్‌ పెద్ద వీల్‌బేస్‌ కార్లు, రెత్‌, డాన్‌ ఉన్నాయని ఆయన చెప్పారు.
దక్షిణాదిలో పెరుగుతున్న ఆదరణ
చెన్నై, హైదరాబాద్‌లలో తమ అధీకృత డీలర్‌గా కున్‌ ఎక్స్‌క్లూజివ్‌ను నియమించినట్టు ఆయన చెప్పారు. దక్షిణాదిలో విలాసవంతమైన కార్లకు ఆదరణ పెరుగుతున్నదని, భారత ఆటోమొబైల్‌ మార్కెట్‌ పరంగా చూసినా చెన్నై ప్రధానమైన ఆటోమొబైల్‌ హబ్‌ అని చెబుతూ అందుకే ఈ కారును చెన్నైలో విడుదల చేశామని ఆయన అన్నారు. దక్షిణాదిలో ప్రస్తుతం తమకు ఐదు ఔట్‌లెట్లున్నాయని ఆయన చెప్పారు. 214 శాతం దిగుమతి సుంకం, జిఎ్‌సటి కారణంగా కారు ధర అధికంగా ఉన్నదని పాల్‌ అన్నారు. తక్కువ సమయంలోనే ఎక్కువ మార్పులు చేశారని ఇది ఏ మాత్రం మంచిది కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఆటోమోటివ్‌ పరిశ్రమ గత ఏడాది ఎలాంటి నిలకడ లేకుండా ఎగుడుదిగుడులుగా పయనించిందని, డీమానిటైజేషన్‌, జిఎ్‌సటి ప్రభావం అధికంగా పడిందని ఆయన చెప్పారు.