ఆమెతోబుట్టువులనే తన కుటుంబం అని భావించింది. పిల్లలు పుట్టడం లేదని భర్త వదిలేస్తే చెల్లెళ్లు, వారి పిల్లల కోసమే ప్రతిపైసా ఖర్చుచేసింది. చక్కని ఇల్లు కూడా కట్టించింది. చెల్లెళ్ల పిల్లలందరికీ ఉన్నంతలో ఘనంగా పెళ్లిళ్లు చేసింది.. వారు మాత్రం ఆమెను డబ్బును సమకూర్చే యంత్రంగానే చూశారు. చేతిలో డబ్బులన్నీ అయిపోయి, వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమెను నిర్దాక్షిణ్యంగా ఇంటి నుంచి గెంటేశారు! అందరూ ఉన్నా ఇప్పుడామె బుక్కెడు బువ్వ కోసం బిచ్చమెత్తుకుంటోంది. యాదాద్రి జిల్లా మోత్కూరుకు చెందిన నర్సమ్మ (80) దయనీయ గాథ ఇది. ఆమెకు తమ్ముళ్లు బండయ్య, బుచ్చయ్య, యాదయ్య.. చెల్లెళ్లు యాదమ్మ, బండెమ్మలు ఉన్నారు. అప్పట్లో నర్సమ్మ వివాహం లింగాల వెంకటనర్సుతో జరిగింది. నర్సమ్మకు పిల్లలు పుట్టడం లేదనే కారణంతో భర్త మరో పెళ్లి చేసుకున్నాడు. ఒంటరైన నర్సమ్మ.. బాబాయి రామస్వామితో కలిసి ఉపాధి కోసం 1984లో ముంబై వెళ్లింది. అక్కడ కూలీ పనులు చేసుకుంటున్న ఆమెకు పంజాబ్‌కు చెందిన రత్నమ్మ పరిచయమైంది. నర్సమ్మను ఆమె.. సినీ నటులు దేవానంద్‌, అమితాబచ్చన్‌ ఇళ్లలో పాచి పని చేసేందుకు కుదిర్చింది. అక్కడే పనిచేస్తూ వచ్చిన డబ్బులను నర్సమ్మ తన చెల్లెళ్లకే పంపేది. పదేళ్లు పనిచేశాక కామెర్లు రావడంతో నర్సమ్మ ఆరోగ్యం దెబ్బతింది. అమితాబ్‌, దేవానంద్‌ ఆమెకు కొంత డబ్బిచ్చి ఊరికి పంపిచారు. ఆ డబ్బుతోనే నర్సమ్మ తన చెల్లెళ్ల కూతుళ్ల వివాహాలను ఘనంగా జరిపించింది. ఆమె వద్ద డబ్బులన్నీ అయిపోవడంతో చెల్లెళ్లు ఆమెను సూటిపోటి మాటలతో వేధించారు. కొద్దిరోజులకు ఇంట్లో నుంచే వెళ్లగొట్టారు. తీవ్ర మనస్తాపంతో హైదరాబాద్‌కు చేరుకున్న నర్సమ్మ.. కవాడిగూడలో తెలిసిన వారి వద్ద ఉంటూ చిన్న చిన్న పనులు చేస్తూ బతికేది. వృద్ధాప్య సమస్యలతో తన పనులు తాను చేసుకోలేని స్థితిలో ఉప్పల్‌లో ఉంటున్న చెల్లలు యాదమ్మ ఇంటికి ఎన్నోసార్లు వెళ్లింది. అయితే, ఎప్పటికప్పుడు వారు ఆమెను చీదరించుకున్నారనే తప్ప దగ్గరకు తీయలేదు.
చివరకు ఆమె యాచకురాలిగా మారింది. కవాడిగూడలో రోడ్లపై బిచ్చమెత్తుకుంటూ బతుకుతోంది. వృద్ధాప్యంతో నర్సమ్మ ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఆమె దయనీయ స్థితిని చూసి చలించిన కవాడిగూడ గాంధీనగర్‌కు చెందిన టీఆర్‌ఎస్‌ నేత శ్రీశైలంయాదవ్‌ నర్మద ఆస్పత్రిలో చేర్పించారు. ఆయన కుటుంబసభ్యులు దగ్గరుండి ఆమెకు సేవలు అందించారు. విషయాన్ని ఉప్పల్‌లోని నర్సమ్మ బంధువులకు తెలిపినప్పటికీ వారు తమకేమీ సంబంధం లేదని తేల్చారు. దీంతో ఆస్పత్రిలో చికిత్సకు అయిన బిల్లును శ్రీశైలం యాదవ్‌ చెల్లించారు. అనంతరం ఆమెను తన ఇంట్లోనే ఓ గదిలో ఉంచి బాగోగులు చూస్తున్నారు.
బంధువులు వెళ్లగొట్టారు
డబ్బంతా బంధువుల కోసమే ఖర్చు చేశాను. ఇప్పుడు ముసలితనంలో నన్నెవరూ పట్టించుకోవడం లేదు. ఉప్పల్‌లో ఉంటున్న చెల్లెలు నన్ను వెళ్లగొట్టింది. కవాడిగూడకు వచ్చి శ్రీకనకాల కట్టమైసమ్మ దేవాలయం వద్ద బిచ్చమెత్తుకుంటూ బతుకుతున్నాను. పది రోజుల క్రితం తీవ్ర అనారోగ్యంతో ఇబ్బందులు పడుతుంటే స్థానికులు ఆస్పత్రిలో చేర్చారు.