పైకి ఎగిరేటప్పుడు, దిగేటప్పుడే ఆ యుద్ధ విమానం వేగం గంటకు 340 కిలోమీటర్లు. అంతకంతకీ వేగం పెంచుకుంటూ, రాకెట్‌లా ఆకాశంలోకి దూసుకెళ్లి, గిరికీలు కొట్టే
‘మిగ్‌ – 21 బైసన్‌’ ఫైటర్‌ జెట్‌ నడపటం అంటే ఆషామాషీ కాదు. అలాంటిది
ఆ విమానాన్ని 30 నిమిషాలపాటు…ఒంటరిగా నడిపి చరిత్ర సృష్టించింది అవనీ చతుర్వేది. ఫైటర్‌ ఎయిర్‌క్రా్‌ఫ్టని నడిపిన మొట్టమొదటి భారతీయ మహిళగా గుర్తింపు పొందిన అవని విశేషాలు చాలానే ఉన్నాయి.
ఎప్పటికైనా ఆకాశంలో ఎ గరాలనేది మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాకు చెందిన అవనీ చతుర్వేది చిన్నప్పటి కల. ఆ కల ఆమెతోపాటే పెరిగి పెద్దయింది. అయితే ఆ కల నిజమయ్యేదెలా? చదవాలనుకుంటున్నది కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌. కానీ ఫైటర్‌ జెట్‌ నడపాలనేది కల. ఆ రెండు కోరికలు తీరాలంటే ఆ రెండు ప్రయత్నాలు సమాంతరంగా సాగాలి. అందుకే, రాజస్థాన్‌లోని బనస్థలి యూనివర్సిటీలో బిటెక్‌ చదువుతూనే, ఫ్లయుంగ్‌ క్లబ్‌లో మెంబర్‌గా చేరింది. అలా శిక్షణ తీసుకుంటూనే, బిటెక్‌ ముగించి, 2014లో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ పరీక్ష పాసె,ౖ భారతీయ వైమానికదళంలో చేరిపోయింది.
అవని తండ్రి ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌, తల్లి గృహిణి. అవని అన్నయ్య కూడా ఆర్మీ ఆఫీసరే! చిన్నప్పటి నుంచీ అన్నను ఆర్మీ దుస్తుల్లో చూసిన అవనికి అతనిలా ఆర్మీలో స్థిరపడాలనే కోరిక కూడా కలిగేదట. ఆ విషయం గురించి చెబుతూ…‘మా అన్నయ్యే నాకు స్ఫూర్తి. తనని చూసినప్పుడల్లా ఆర్మీ వృత్తిలో స్థిరపడాలని అనిపిస్తూ ఉండేది. మరోపక్క, ఆర్మీలో వైమానికదళంలో చేరితే, విమానాలు నడపాలనే నా కలనూ నిజం చేసుకోవచ్చు. అందుకే, చదువు పూర్తవగానే ఆర్మీలో చేరిపోయాను’ అంటూ చెప్పుకొచ్చింది అవని. ఫైటర్‌ జెట్‌ నడిపిన తొలి మహిళా పైలట్‌గా పేరు తెచ్చుకున్న వేళ ఆమె మాట్లాడుతూ….‘ఫైటర్‌ పైలట్లను బట్టే ఏ వైమానికదళానికైనా పేరొస్తుంది. అలాంటి మంచి ఫైటర్‌ పైలట్‌ కావాలనేది నా కల. అన్నిటికంటే మంచి ఎయిర్‌క్రాఫ్ట్‌ నడపాలనేది నా ఆశయం’ అంటూ చెప్పింది. అవనికి విమానాలు నడపటమే కాదు, బొమ్మలు గీయటం, వయొలిన్‌ కూడా వచ్చు. ఖాళీ సమయాల్లో చెస్‌ ఆడుతుందట. తన చిన్ననాటి కలను సాకారం చేసుకున్న అవనీ చతుర్వేది, ‘ది బెస్ట్‌ ఫైటర్‌ పైలట్‌’గా గుర్తింపు పొందాలని కోరుకుందాం!