అవసరాలే వ్యాపార ఆలోచనలకు పునాది. అనేక మందిని వేదిస్తున్న మధుమేహం, పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న సాధారణ శానిటరీ నాప్‌కిన్స్‌కు సరైన ప్రత్యామ్నాయ ఉత్పత్తులు తయారు చేస్తూ ఇద్దరు భారత ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలు అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకున్నారు. స్టీవియా అనే మొక్క ద్వారా పంచదారకు ప్రత్యామ్నాయంగా సహజ సిద్ధమైన తీపి పదార్ధాలు తయారు చేస్తున్న అర్బోరియల్‌ ఆగ్నో ఇన్నొవేషన్స్‌ అధినేత స్వాతి పాండే, అరటి నారతో శానిటరీ నాప్‌కిన్స్‌ తయారు చేస్తున్న సాతి ఇంక్‌ అధినేత క్రిస్టిన్‌ కాజెస్టుకు కార్టియర్‌ ఉమెన్‌ ఇనిషియేటివ్‌ అవార్డులు లభించాయి. ఈ అవార్డుల కింద వీరిరువురికి ఒక్కొక్కరికి 30,000 డాలర్లు (సుమారు రూ.19.5 లక్షలు) లభిస్తాయి. 130 దేశాల నుంచి వచ్చిన 2,800 అప్లికేషన్లను పరిశీలించి వీరితో పాటు మొత్తం 18 మందికి ఈ అవార్డులకు ఎంపిక చేశారు. వీరందరికీ ఈ సంవత్సరం ఏప్రిల్‌లో సింగపూర్‌లో వారం రోజుల పాటు వ్యాపార మెలుకువలపై ప్రత్యేక వర్క్‌షాపులు, శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి. ఏప్రిల్‌ 26న అక్కడ జరిగే ఒక కార్యక్రమంలో విజేతగా నిలిచిన ఒకరికి లక్ష డాలర్లు (సుమారు రూ.65 లక్షలు) లభిస్తాయి.