ఐటీ రంగానికి సంబంధించి హైదరాబాద్‌లో మరో ప్రతిష్ఠాత్మక సంస్థ ఏర్పాటు కానుంది. ప్రస్తుతం ఐటీ రంగంలో హాట్‌ టాపిక్‌గా మారిన డేటా సైన్స్‌, కృత్రిమ మేధస్సు(ఏఐ)పై పరిశోధన కోసం రాష్ట్ర ప్రభుత్వం-నాస్కామ్‌ సంయుక్తంగా సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌(సీవోఈ) ఏర్పాటు చేయనున్నాయి. ఈ కేంద్రాన్ని హైదరాబాద్‌ ట్రిపుల్‌ ఐటీలో ఏర్పాటు చేస్తామని ప్రపంచ ఐటీ సదస్సు సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన అవగాహనా ఒప్పందం(ఎంవోయూ) పత్రాలను మంత్రి సమక్షంలో నాస్కామ్‌ ప్రెసిడెంట్‌ ఆర్‌.చంద్రశేఖర్‌, రాష్ట్ర ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్‌ అందజేసుకున్నారు. రూ.40 కోట్ల అంచనాతో ఏర్పాటు చేసే ఈ సీవోఈని తర్వాత బుద్వేల్‌ దగ్గర ఏర్పాటు చేసే ఐటీ పార్కుకు తరలిస్తామని మంత్రి చెప్పారు.
  నాస్కామ్‌ ఈ కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి దేశంలో తొలిసారిగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తోంది. ఈ సందర్భంగా కొత్త టెక్నాలజీతో ఉద్యోగాలు పోతాయన్న వాదనను కేటీఆర్‌ తోసిపుచ్చారు. ‘అదంతా భ్రమ. నిజానికి డేటా సైన్స్‌, కృత్రిమ మేధస్సు రంగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. 2025 నాటికి ఈ రెండు రంగాల్లో భారత ఐటీ కంపెనీలకు 1600 కోట్ల డాలర్ల విలువైన వ్యాపార అవకాశాలు ఏర్పడతాయి. అదే సమయంలో ఈ రంగంలో 1.5 లక్షల ఉద్యోగాలకు అవకాశం ఉంది’ మంత్రి అన్నారు.