మృతులకు నివాళి అర్పించే సమయంలో సాధారణంగా ప్రమిదలను పట్టుకుంటారు. అలాంటపుడు ఒక ప్రమిద రూపంలోనే స్మృతి చిహ్నం ఎందుకు ఉండకూడదు? అమర వీరుల స్మృతి చిహ్నాన్ని ప్రమిద రూపంలో నిర్మిస్తే ఎలా ఉంటుంది? ఇవీ.. ప్రముఖ చిత్ర, శిల్పకారుడు.. హైదరాబాద్‌ ఆర్ట్‌ సొసైటీ అధ్యక్షుడు ఎంవీ రమణారెడ్డి మదిలో మెదిలిన ఆలోచనలట! అనుకున్నదే తడవుగా పలు డిజైన్లను సిద్ధం చేసి, సీఎం కేసీఆర్‌కు పంపానని.. వాటిలోంచి ఒకదానిని ఆయన ఆమోదించారని రమణారెడ్డి చెప్పారు. రాష్ట్ర సాధన కోసం అమరులైన వారిని స్మరించుకుని, ఉద్యమ చరిత్రను భవిష్యత్తు తరాలు తెలుసుకునేలా ఈ స్మృతి చిహ్నం ఉండాలన్నదే సీఎం కేసీఆర్‌ ఉద్దేశమన్నారు. అందరూ తమ కుటుంబంతో వచ్చి అమరులను స్మరించుకునేలా ఉండాలని ఆయన భావించారని, అందుకు తగ్గట్టుగా అమరుల స్మృతి చిహ్నాన్ని రూపొందించానని చెప్పారు. తెలంగాణ చరిత్రను భవిష్యత్తు తరాలకు అందించేందుకూ ఈ నిర్మాణం దోహదపడుతుందన్నారు. అమర వీరుల స్మృతి చిహ్నం నిర్మాణానికి సంబంధించిన విశేషాలను రమణారెడ్డి గురువారం ‘ఆంధ్రజ్యోతి’తో పంచుకున్నారు. అవి ఆయన మాటల్లోనే..
వెయ్యేళ్లయినా చెక్కుచెదరకుండా..
తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది బలిదానాలు చేశారు. వారి త్యాగాల స్ఫూర్తి అందరికీ అర్థం అయ్యేలా.. కొత్తగా కనిపించేలా కళాత్మకంగా అమరుల స్మృతి చిహ్నం ఉండాలి. అదే సమయంలో నిర్మాణం అంతర్జాతీయ ప్రమాణాలతో చేయాలి. ఇలా ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రమిద రూపంలో డిజైన్‌ రూపొందించాను. ఈ నిర్మాణం వెయ్యేళ్లకుపైగా చెక్కు చెదరకుండా ఉండేందుకు స్టెయిన్‌లె్‌స స్టీల్‌తో కట్టేలా డిజైన్‌ చేశాను. సెల్లార్‌ను మినహాయించి పైభాగంలో ఉండే మూడు అంతస్థులను దాదాపు స్టెయిన్‌లె్‌స స్టీల్‌తోనే నిర్మిస్తారు. నాకు తెలిసి ఆసియాలోనే ఇలాంటి నమూనాతో కూడిన నిర్మాణం లేదు. సెల్లార్‌లోని రెండు అంతస్థులను పార్కింగ్‌ కోసం కేటాయిస్తారు. 400కు పైగా కార్లు, 300కు పైగా టూవీలర్లు పార్కింగ్‌ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇక మూడో అంతస్థు పాక్షికంగా సెల్లార్‌లో, బేస్‌మెంట్‌లో కలిసి ఉంటుంది. ప్రమిద రూపం వచ్చేందుకు ఇలా ఏర్పాటు చేశాం. నిర్మాణానికిసంబంధించిన విద్యుత్తు సరఫరా, స్టోరేజ్‌ అవసరాల కోసం ఈ అంతస్థును వాడుకుంటారు. నీటి పక్కనే ఈ నిర్మాణం ఉంటుంది. ఈ నిర్మాణంపై ఇంజనీరింగ్‌లో పలు విభాగాలకు చెందిన నిపుణులతో ఎన్నో సంప్రదింపులు జరిపాను. నిర్మాణం చేపట్టే స్థలంలోని భూసార పరీక్ష కూడా నిర్వహించాం. 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా నిర్మాణానికి ఇబ్బందులు రాకుండా రూపల్పన చేశాను.
మ్యూజికల్‌ వాటర్‌ ఫౌంటేన్‌, భారీ స్థూపం
నిర్మాణం ముందు గ్రౌండ్‌ లెవెల్లో పార్కు ఉంటుంది. అక్కడ మ్యూజికల్‌ వాటర్‌ ఫౌంటేన్‌ నిర్మిస్తారు. ఫౌంటేన్‌ ముందు భాగంలో 40 అడుగుల ఎత్తులో ఒక స్థూపం ఉంటుంది. దానిపై తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. స్థూపం చుట్టూ 12 వరకు చిన్న స్తంభాలు ఉంటాయి. రామప్ప దేవాలయంలోని సింహాల శిల్పాలను పోలిన వాటిని ఈ స్తంభాలపై ఏర్పాటు చేస్తాం. వాటి చుట్టూ తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా చిహ్నాలు, ఉంటాయి. సందర్శకుల కోసం వేర్వేరుగా మెట్ల నిర్మాణం ఉంటుంది. ఫౌంటేన్‌కు రెండు పక్కలా ఒక్కోవైపు అయిదు విగ్రహాలు ఏర్పాటు చేస్తాం.
గ్రౌండ్‌ ఫ్లోర్‌లో మ్యూజియం
స్మృతి చిహ్నం నిర్మాణంలో భాగంగా గ్రౌండ్‌ ఫ్లోర్‌లో మ్యూజియం ఉంటుంది. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన నేపథ్యం, జరిగిన తీరు, అమరుల వివరాలు.. ఇలా అన్ని అంశాలు ఈ మ్యూజియంలో పొందుపరచాలని భావిస్తున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ఆడియో, వీడియో రూపంలో ప్రెజెంట్‌ చేసే అవకాశం కూడా ఇక్కడ కల్పిస్తారు. ఉద్యమ ఘట్టాలకు సంబంధించి డాక్యుమెంటరీలు, ఆడియో రికార్డులు, ఇక్కడ నిక్షిప్తం చేస్తారు. ఇండిపెండెంట్‌ స్ర్కీన్లు ఇరవై వరకు ఏర్పాటు చేస్తారు. మెయిన్‌ హాల్‌లో మరో స్ర్కీన్‌ ఉంటుంది. దాంట్లో ఉద్యమ సినిమాలను ప్రదర్శిస్తారు. గ్రౌండ్‌ఫ్లోర్‌ నుంచి పైకి వెళ్లేందుకు లిఫ్టులు ఉంటాయి. అక్కడి నుంచి మొదటి అంతస్థుకు వెళ్లొచ్చు. అక్కడ దాదాపు 700 మందికి పైగా కూర్చునే సదుపాయంతో ఒక కన్వెన్షన్‌ హాల్‌ ఉంటుంది. కట్టడం పర్యవేక్షణ కోసం మొదటి అంతస్థులో ఒక కార్యాలయం కూడా ఉంటుంది. ఇక టెర్ర్‌సలోని ఒక పోర్షన్‌లో రెస్టారెంట్‌ ఉండేలా రూపకల్పన చేశాం. మ్యూజియం, కన్వెన్షన్‌హాల్‌తోపాటు అన్నింటిని చూసి వచ్చేసరికి దాదాపు 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. అలాంటి సమయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా రెస్టారెంట్‌లోనే తినొచ్చు. ప్రమిద వెలిగే భాగం ఈ టెర్రస్‌ నుంచి ప్రారంభం అవుతుంది. రెండో అంతస్తులో ప్రత్యేకించి ఏమీ ఉండవు. ప్రస్తుతానికి అందుకు సంబంధించి ఏదీ అనుకోలేదు.
నా జన్మధన్యమైంది
‘‘ఎంతో మంది త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. వారికి నివాళులర్పించేందుకు ఒక స్మృతి చిహ్నాన్ని రూపొందించడం నా అదృష్టంగా భావిస్తున్నా. నా జన్మ ధన్యమైంది. వృత్తిరీత్యా చాలా కాలం యూరో్‌పలో ఉండాల్సి వచ్చింది. 2007లో తెలంగాణకు వచ్చాను. అప్పటికే ఉద్యమం ఉధృతమైంది. నా వంతు బాధ్యతగా ఉద్యమంలో పాల్గొన్నా. నాకు తెలిసిన కళనే ఉద్యమ అస్త్రంగా మార్చుకుని అనేక ఆర్ట్‌ క్యాంపులను నిర్వహించాను. కళాకారులను సమన్వయం చేస్తూ… ప్రజలకు తెలంగాణ ఉద్యమం గురించి అవగాహన పెంచేందుకు ప్రయత్నం చేశాను. తెలంగాణ ఉద్యమం, విద్యార్థులు, నిరుద్యోగుల బలిదానాలు దగ్గరగా చూశాను. ఉద్యమ సమయంలో నిర్వహించిన కార్యక్రమాల కోసం పోస్టర్లు, టీ-షర్ట్‌లపై డిజైన్లు చేసి ఇచ్చేవాడిని. ఢిల్లీ పరేడ్‌కి పంపిన రాష్ట్ర ప్రభుత్వ శకటాన్ని రూపొందించే అవకాశం కూడా నాకు దక్కింది. తెలంగాణ అమరుల స్మృతి చిహ్నాన్ని రూపొందించే అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌, ఆయన ఓఎస్డీ దేశపతి శ్రీనివా్‌సకు ఎప్పటికీ కృతజ్ఞుడను’’ -రమణారెడ్డి