పవన్ కల్యాణ్ మాజీ భార్యగా, ఇప్పటికీ సంచలన తారగా కితాబులు అందుకుంటున్న రేణుదేశాయ్.. తన జీవితం గురించి ఆలోచించడం మొదలెట్టింది. పవన్ మరో పెళ్లి చేసుకున్నా.. రేణుదేశాయ్ మాత్రం ఉన్న ఆ ఇద్దరు పిల్లలే ప్రపంచంగా బ్రతుకుతోంది. ఒకప్పుడు హీరోయిన్‌గా వెండితెరపై వెలిగిపోవాలనుకున్న ఆమె కోరిక రెండే రెండు సినిమాలతో ముగిసిపోయింది. సహజీవనం, పెళ్లి, పిల్లలు, విడాకులు.. ఇలా అన్ని తన జీవితంలో అతి తొందరగా వచ్చేయడంతో ప్రస్తుతం జ్ఞాప‌కాల‌తో బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఒక్కసారి రేణుదేశాయ్ గురించి ఎవరైనా ఆలోచించడం మొదలెడితే.. చివరికి అయ్యో అనే పదం మాత్రమే మిగులుతుంది. తన జీవితాన్ని సరిచేసుకోవాలని, మళ్లీ పెళ్లి చేసుకోవాలని కోరిక ఉన్నా.. కొన్ని బంధాలు ఆ కోరికకు సంకెళ్లు వేస్తున్నాయి. ఆ బంధం ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక విషయంలోకి వస్తే తాజాగా రేణుదేశాయ్.. ఓ వీడియోని షేర్ చేసింది. తన జీవితంలో పాతుకుపోయిన జ్ఞాప‌కాలు మ‌ళ్లీ గుర్తొచ్చాయంటూ కొంచెం బాధ‌, ఇంకొంచెం ఆవేద‌న క‌ల‌గ‌లిపి ఆమె రాసుకున్న ఓ క‌వితతో కూడిన వీడియో ఇది.
‘‘నా జ్ఞాప‌కాల‌న్నింటినీ చూసుకుంటున్నాను. ఆయ‌న మాట‌లు, ప‌దాలు, ఆయ‌న పేరు చెక్కిన క‌లం నా జ్ఞాప‌కాల్లో ఉన్నాయి. కానీ క‌మ్ముకున్న హిమం క‌రిగిపోయి మ‌ళ్లీ ఆ జ్ఞాప‌కాలు క‌ళ్లెదుట నిలిచాయి. విధి ఎంత బ‌లీయమైనది. మ‌న‌సు లోతుల్లో పాతుకుపోయిన జ్ఞాప‌కాలన్నింటినీ మ‌ళ్లీ తట్టిలేపింది. ఆ జ్ఞాప‌కాల‌ను ఇప్పుడు తిరిగి చూసుకుంటే తుప్పు ప‌ట్టిన క‌లం, దానిపై రాసుకున్న పేరు తుడిచిపెట్టుకుపోయాయి. ముక్క‌లైన హృద‌యం, నేను రాసుకున్న లేఖల కాగిత‌పు ముక్క‌లు క‌న్పించాయి’’ అంటూ ‘డాలర్- ఏ ఫిగర్ ఆఫ్ స్పీచ్’ అనే టైటిల్‌తో ఉన్న ఈ వీడియోలో జ్ఞాప‌కాల‌ గురించి ఆమె తెలిపిన విధానం గుండెలను పిండేసింది. ఆమె తెలిపిన ఈ జ్ఞాప‌కాలన్నీ పవన్ గురించే అని నెటిజన్లు ఈ వీడియోపై కామెంట్స్ చేస్తున్నారు.